సైదాబాద్ స్టీల్ బ్రిడ్జి రెడీ.. నగర ట్రాఫిక్కు ఊరట.. మంత్రి పొన్నం
సైదాబాద్ స్టీల్ బ్రిడ్జి రెడీ.. నగర ట్రాఫిక్కు ఊరట.. మంత్రి పొన్నం
Minister


హైదరాబాద్, 05 ఆగస్టు (హి.స.)

హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ రద్దీని

తగ్గించి ప్రజలకు వేగవంతమైన రవాణా సౌకర్యం కల్పించే లక్ష్యంతో నిర్మిస్తున్న సైదాబాద్ స్టీల్ బ్రిడ్జి నిర్మాణ పనులు పూర్తయ్యాయని హైదరాబాద్ ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. నూతనంగా నిర్మించిన సైదాబాద్ స్టీల్ బ్రిడ్జితో పాటు మూసారాంబాగ్ బ్రిడ్జి పనులను మంత్రి అజారుద్దీన్తో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు అహ్మద్ బిన్ అబ్దుల్లా బలాలా, కాలేరు వెంకటేష్, ప్రభుత్వ సలహాదారు వి. హనుమంతరావు, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. అనంతరం మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, దాదాపు రూ.680 కోట్ల వ్యయంతో నిర్మించిన సైదాబాద్ స్టీల్ బ్రిడ్జి చంచల్గూడ జైలు నుంచి ఓవైసీ ఆస్పత్రి వరకు, మరో వైపు చంపాపేట దిశగా అనుసంధాన మార్గంతో సిద్ధమైందని తెలిపారు. త్వరలో ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఈ బ్రిడ్జిని ప్రజలకు అంకితం చేయనున్నట్లు వెల్లడించారు.

మూసారాంబాగ్ బ్రిడ్జి పనులు కూడా తుది దశకు..

ఈ బ్రిడ్జి ప్రారంభంతో సైదాబాద్, సంతోష్నగర్, చంచల్గూడ, చంపాపేట ప్రాంతాల ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులు గణనీయంగా తగ్గి, నగరంలోని ఇతర ప్రాంతాలకు తక్కువ సమయంలో చేరుకునే అవకాశం కలుగుతుందని ఆయన పేర్కొన్నారు. అలాగే మూసారాంబాగ్ బ్రిడ్జి పనులు కూడా తుది దశకు చేరుకున్నాయని, త్వరలోనే ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు. బ్రిడ్జిలకు అనుసంధానంగా అప్రోచ్ రోడ్ల విస్తరణ పనులను కూడా వేగవంతం చేస్తున్నామని చెప్పారు. పెండింగ్లో ఉన్న కీలక మౌలిక వసతుల ప్రాజెక్టులను పూర్తి చేయడంలో ముఖ్యమంత్రి ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారని పేర్కొన్న మంత్రి, పెరుగుతున్న నగర జనాభా, వాహనాల రద్దీకి అనుగుణంగా ఆధునిక మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని తెలిపారు. కేబీఆర్ పార్క్ సమీపంలోని బ్రిడ్జి పనులు కూడా వేగంగా కొనసాగుతున్నాయని, ట్రాఫిక్ సమస్యలను తగ్గిస్తూ ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande