
హైదరాబాద్, 07 ఆగస్టు (హి.స.)
తెలంగాణలో యాప్ ఆధారిత వాహన, ఫుడ్ డెలివరీ సేవలకు శనివారం నుంచి బ్రేక్ పడనుంది. ఓలా, ఉబర్, ర్యాపిడో వంటి క్యాబ్ సర్వీసులతో పాటు స్విగ్గీ, జొమాటో, జెప్టో వంటి ఫుడ్ డెలివరీ సేవలు రాష్ట్రవ్యాప్తంగా నిలిచిపోనున్నాయి. ఆగస్టు 8 నుంచి నిరవధిక సమ్మెకు దిగుతున్నట్లు గిగ్ వర్కర్ల 'జాయింట్ యాక్షన్ కమిటీ' (జేఏసీ) ప్రకటించింది. హైదరాబాద్ నాంపల్లిలోని గిగ్ ఆఫీసులో సమావేశమైన 16 సంఘాల ప్రతినిధులు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.
తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి పలుమార్లు తీసుకెళ్లినా సరైన స్పందన లేకపోవడంతోనే సమ్మెకు దిగుతున్నట్లు జేఏసీ నేతలు స్పష్టం చేశారు. గిగ్ వర్కర్ల కోసం ప్రత్యేకంగా సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని, తెలంగాణ గిగ్, ప్లాట్‌ఫారం వర్కర్స్ రూల్స్‌ను అమలు చేయాలని వారు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. యాప్ ఆధారిత రవాణా సేవలకు కనీస ఛార్జీ, కిలోమీటర్‌కు, నిమిషానికి న్యాయపరమైన ఛార్జీలను నోటిఫై చేయాలని కోరుతున్నారు. మోటార్ వెహికల్ అగ్రిగేటర్ మార్గదర్శకాలకు అనుగుణంగా కనీస ఛార్జీలు నిర్ణయించి, డ్రైవర్లు, డెలివరీ సిబ్బందికి స్థిరమైన ఆదాయం లభించేలా చూడాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi