
మహబూబ్నగర్, 07 ఆగస్టు (హి.స.)
చేనేత రంగ అభివృద్ధికి, నేత కార్మికులకు జిల్లా యంత్రాంగం అన్ని విధాలా సహకారం అందిస్తుందని మహబూబ్నగర్ జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తా తెలిపారు. శుక్రవారం జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా కలెక్టర్ కార్యాలయ సమావేశంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు. చేనేత వస్త్రాల తయారీ వెనుక కార్మికుల శ్రమ, నైపుణ్యం, అంకితభావం దాగి ఉన్నాయని, చేతితో నేసిన ప్రతి వస్త్రానికి ప్రత్యేకమైన గుర్తింపు ఉంటుందని కలెక్టర్ అన్నారు. యంత్రాలతో తయారయ్యే వస్త్రాలతో పోలిస్తే చేనేత ఉత్పత్తులకు కళాత్మకత, నాణ్యత, సంప్రదాయం ప్రతిబింబిస్తాయని పేర్కొన్నారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు చెందిన గద్వాల్, నారాయణపేట చేనేత ఉత్పత్తులు దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు పొందాయని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాల ద్వారా చేనేత కార్మికులకు గరిష్ట ప్రయోజనాలు అందేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. మహబూబ్నగర్ శిల్పారామంలో స్థానిక చేనేత ఉత్పత్తుల విక్రయానికి స్టాల్ ల కేటాయింపు ప్రాధాన్యం కల్పించనున్నట్లు, ఆసక్తి ఉన్న చేనేత కార్మికులు హ్యాండ్లూమ్ అధికారుల వద్ద పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. జిల్లాకు వచ్చే విశిష్ట అతిథులకు అందించే బహుమతులు, శాలువాలు స్థానిక చేనేత కార్మికుల నుంచే కొనుగోలు చేయాలని నిర్ణయించినట్లు కలెక్టర్ వెల్లడించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..