
నిజామాబాద్, 10 సెప్టెంబర్ (హి.స.)
గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని రకాల మౌలిక వసతులు, సౌకర్యాలు కల్పించేందుకు విస్తృత స్థాయిలో ఏర్పాట్లు చేపడుతున్నట్లు ప్రభుత్వ సలహాదారు పి.సుదర్శన్ రెడ్డి తెలిపారు.
వచ్చే ఏడాది జూన్, జూలై మాసాలలో జరిగే గోదావరి పుష్కరాల సందర్భంగా పుణ్య స్నానాల కోసం జిల్లాలోని వివిధ పుష్కర క్షేత్రాలకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున పుష్కర ఘాట్ల వద్ద సదుపాయాల కల్పన కోసం అవసరమైన అభివృద్ధి పనులు చేపడుతున్నామని అన్నారు.
త్రివేణి సంగమ ప్రాంతం అయిన రెంజల్ మండలం కందకుర్తి వద్ద, నవీపేట మండలం యంచ వద్ద గోదావరి పుష్కర ఘాట్ల నిర్మాణాలు, ఇతర అభివృద్ధి పనులకు గురువారం రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి, కలెక్టర్ భవేష్ మిశ్రా శంకుస్థాపనలు చేశారు. కందకుర్తి వద్ద నీటిపారుదల శాఖ ఆధ్వర్యంలో రూ. 6.05 కోట్ల అంచనా వ్యయంతో పుష్కర ఘాట్ నిర్మాణానికి, పంచాయతీరాజ్ ఆధ్వర్యంలో రూ.3.90 కోట్ల నిధులతో రోడ్ల నిర్మాణాలకు, దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో రూ. 5.00 కోట్లతో ఆలయ అభివృద్ధి పనులకు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి శంకుస్థాపనలు చేశారు. అదేవిధంగా యంచ వద్ద రూ. 2.15 కోట్ల నిధులతో పుష్కర ఘాట్, రూ. 70 లక్షలతో రోడ్డు నిర్మాణ పనులకు భూమి పూజ నిర్వహించారు.
గోదావరి పుష్కరాలను కుంభమేళా తరహాలో అట్టహాసంగా నిర్వహించాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తున్నారని అన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..