రామంతపూర్ పాలిటెక్నిక్ కాలేజీలో తీవ్ర ఉద్రిక్తత..
నగరంలోని రామంతపూర్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఒక్కసారిగా తీవ్ర ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది.
Polytechnic


హైదరాబాద్, 10 సెప్టెంబర్ (హి.స.)

నగరంలోని రామంతపూర్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఒక్కసారిగా తీవ్ర ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది.

తెలంగాణ ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన జీవో నం. 97ను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ.. విద్యార్థులంతా కలిసి కళాశాల ఆవరణలో ఆందోళనకు దిగారు.

దీంతో వారిని అడ్డుకునేందుకు పోలీసులు యత్నించడంతో ఇరువర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం, ఘర్షణ వాతావరణం నెలకొంది. విద్యార్థులను చెదరగొట్టే క్రమంలో పోలీసులకు, విద్యార్థులకు మధ్య తీవ్రస్థాయిలో తోపులాట జరిగింది. ఈ తోపులాటలో పలువురు విద్యార్థులు నియంత్రణ కోల్పోయి కిందపడిపోవడంతో కొందరికి స్వల్ప గాయాలయ్యాయి. పోలీసుల తీరుపై విద్యార్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రాంగణంలో నిరసనను మరింత ఉధృతం చేశారు.

పరిస్థితి మరింత ఉద్రిక్తం గా మారడంతో పోలీసులు కళాశాల ప్రధాన ద్వారాలను మూసివేసి ఆ ప్రాంతాన్ని తమ అధీనంలోకి తీసుకున్నారు. ఆందోళన దృశ్యాలను చిత్రీకరించేందుకు వచ్చిన వార్తా మీడియా ప్రతినిధులను పోలీసులు కళాశాల లోపలికి అనుమతించకుండా గేట్ వద్ద కట్టడి చేశారు. మీడియాను అడ్డుకోవడంపై విలేకరులు, విద్యార్థి సంఘాల నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యబద్ధంగా తమ సమస్యలపై నిరసన తెలుపుతుంటే పోలీసులు దౌర్జన్యంగా వ్యవహరించడం సమంజసం కాదని విద్యార్థులు మండిపడ్డారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande