మెట్రో టేకోవర్ కోసం రుణాల వేట
మొదటి దశ మెట్రో టేకోవర్ కోసం కావాల్సిన రుణాల కోసం ఎస్బీఐ క్యాపిటల్ సంస్థ (ఎస్బీఐ క్యాప్స్) పడరాని పాట్లు పడుతోంది.
Metro takeover


హైదరాబాద్, 11 సెప్టెంబర్ (హి.స.) మొదటి దశ మెట్రో టేకోవర్ కోసం కావాల్సిన రుణాల కోసం ఎస్బీఐ క్యాపిటల్ సంస్థ (ఎస్బీఐ క్యాప్స్) పడరాని పాట్లు పడుతోంది.

రాష్ట్ర ప్రభుత్వం సూచించిన 3 శాతం వడ్డీతోపాటు మూడు నెలల్లోగా పనిని పూర్తిచేయాలని విధించిన టార్గెట్తో సదరు కంపెనీ ప్రతినిధులు సతమతమవుతున్నారు.

నగరంలో రెండో దశ ప్రాజెక్టులోని 7 కారిడార్లకు అనుమతి కావాలంటే అందుకు అనుగుణంగా ఉన్న ఫస్ట్ ఫేజ్ను పూర్తిగా స్వాధీనం చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం కొన్ని నెలల క్రితం రాష్ట్ర ప్రభుత్వానికి సూచించిన విషయం తెలిసిందే. ఈ మేరకు రూ.15వేల కోట్లతో ఎల్అండ్టీ నుంచి మూడు కారిడార్లను కొనుగోలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది.

ఇందులో రూ.13,600 కోట్ల రుణాలను బ్యాంకుల ద్వారా సేకరించేందుకు ముంబై ప్రధాన కేంద్రంగా నడిచే ఎస్బీఐ క్యాపిటల్ సంస్థకు బాధ్యతలు అప్పగించింది. మిగతా రూ.1,400 కోట్లను సొంతంగా చెల్లించేందుకు నిర్ణయించింది.

అధిక వడ్డీతోనే ఎల్అండ్టీ కుదేలు

మొదటి దశ ప్రాజెక్టు కింద ఎల్బీనగర్-మియాపూర్, జేబీఎస్-ఎంజీబీఎస్, నాగోలు- రాయదుర్గం కారిడార్లలో 72 కిలోమీటర్ల మేర పనులను 2012లో ఎల్అండ్టీ సంస్థ చేపట్టింది. ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ (పీపీపీ) మోడల్లో సదరు సంస్థ సొంతంగా నిర్మాణం చేసింది. మొత్తం 72 కిలోమీటర్లలో 69 కిలోమీటర్లు పూర్తి చేసింది. ఇందుకోసం అప్పటి ప్రభుత్వం నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న 269 ఎకరాలను రవాణా ఆధారిత అభివృద్ధి (టీవోడీ) కింద అప్పగించింది.

60 ఏళ్లపాటు అందులో వాణిజ్య కార్యకలాపాలను నిర్వహించుకుని మెట్రో ఆపరేషన్స్ చేపట్టాలని సూచించింది. అయితే 2012లో రూ.14,132 కోట్లతో ప్రారంభించిన ప్రాజెక్టు పనులు.. మొత్తం పూర్తయ్యే వరకు రూ.22వేల కోట్లకు పెరిగింది. దీంతో ప్రతిపాదిత పనులను పూర్తి చేసేందుకు ఎల్అండ్టీ వివిధ బ్యాంకుల నుంచి అనివార్యంగా అప్పులు తీసుకొచ్చింది. కొన్ని బ్యాంకుల నుంచి 7-8 శాతం వడ్డీతో రుణాలను తీసుకురావడంతో వాటిని కట్టలేక కుదేలైంది.

కరోనాతో కార్యకలాపాలు స్తంభించిపోవడంతో అప్పులు, వడ్డీల భారం అంతకంతకూ పెరిగిపోయి నష్టాలబాట పట్టింది. ఈ నేపథ్యంలో ఎల్అండ్టీ లాంటి పరిస్థితి తమకు రాకుండా ఉండేందుకు ముందు జాగ్రత్తగా 3 శాతం వడ్డీతోనే రుణాల సేకరణ చేయాలని ఎస్బీఐ క్యాప్స్ను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. కాగా, సుమారు రూ.2.50 కోట్లతో కన్సల్టెన్సీని దక్కించుకున్న సంస్థ పడరాని పాట్లు పడుతోంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్


 rajesh pande