
హైదరాబాద్, 16 సెప్టెంబర్ (హి.స.)
బీజేపీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి నేడు తెలంగాణ శాసనసభ సమావేశాల సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. పరిగి, కొండగల్కు వేల కోట్ల రూపాయల నిధులు ఇస్తున్నారని అన్నారు. ఆర్మూర్లో నిజాం కాలంలో కట్టిన ఎంఆర్వో ఆఫీస్ ఉందని అన్నారు. సబ్ కలెక్టర్ ఆఫీస్ కూడా క్లర్క్ కూర్చునే విధంగా ఉందని చెప్పారు. తాను రెవెన్యూశాఖ మంత్రి వద్దకు పలుమార్లు వెళ్లానని, రెండేళ్ల నుండి ఇంటిగ్రేటెడ్ కార్యాలయం కోసం అడుగుతున్నానని అన్నారు. నిజామాబాద్ జిల్లా అంటే ప్రభుత్వానికి చిన్నచూపు అని అన్నారు.
ప్రభుత్వం చేసే చర్యల వల్ల అవసరం అయితే రాజీనామా చేస్తానంటూ అసహనం వ్యక్తం చేశారు. నిజామాబాద్ జిల్లా ఎవరికి పట్టని జిల్లాగా మారిందన్నారు. ఒకప్పుడు నిజాంసాగర్ నీళ్లతో కలకలలాడిన జిల్లా ఇప్పుడు కరువుతో ఇబ్బంది పడుతోందని చెప్పారు. తమకు లక్షల కోట్ల పెట్టుబడులు రావడంలేదని, కనీసం ఇంటిగ్రేటెడ్ కార్యాలయం ఇప్పించాలన్నారు. అన్ని లెక్కలు చెప్పి రాజీనామా చేస్తానని, పది నిమిషాలు మాట్లాడే అవకాశం ఇవ్వాలని రాకేష్ రెడ్డి స్పీకర్ ను కోరడం సంచలనంగా మారింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు