
పెద్దారవీడు,, 02 సెప్టెంబర్ (హిం .స,,)
: ఇంట్లోకి టీవీ, గ్యాస్ తెచ్చుకునేందుకు వెళ్లి వెలిగొండ సాగర జలాల్లో చిక్కుకున్న ముగ్గురు వ్యక్తులు సురక్షితంగా బయటపడ్డారు. పోలీసులు, స్థానికులు తెలిపిన ప్రకారం.. పెద్దారవీడు మండలం, కలనూతల (నల్లమల జలాశయం ముంపు గ్రామం)కు చెందిన నల్లబోతుల శ్రీను, తిరుపతి నాయుడు, పసుపులేటి రమణ అర్ధరాత్రి బొలెరో వాహనంలో వెళ్తూ వెలిగొండ సాగర్ జల ప్రవాహంలో చిక్కుకున్న విషయం తెలిసిందే. వాహనం నీళ్లలో కొట్టుకు పోయింది. అందులోని ఈ ముగ్గురూ పక్కనే ఉన్న చెట్టుపైకి ఎక్కి చరవాణితో లైటింగ్ వేయడంతో స్థానికులు గుర్తించారు. ఈ మేరకు అక్కడే ఉన్న స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించగా సంఘటనా స్థలానికి చేరుకుని సహాయ చర్యలు చేపట్టారు. నీళ్ల ఉద్ధృతి ఎక్కువగా ఉండటంతో వారిని బయటకు తీసుకురావడం కష్టంగా మారింది. ఈ నేపథ్యంలో కలెక్టర్ విజయ సునీత, జేసీ శ్రీనివాసులు, మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి, డీఎస్పీ నాగరాజు ఆధ్వర్యంలో అర్ధరాత్రి వరకూ సహాయ చర్యలు కొనసాగాయి. చివరకు జేసీబీ వాహనం తెప్పించి తెల్లవారుజామున నీళ్లలో చిక్కుకున్న ముగ్గురు వ్యక్తులను సురక్షితంగా బయటకు తెచ్చారు. దీంతో వారు ప్రాణాపాయం నుంచి బయటపడినట్లయిందని పోలీసులు తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ