
హైదరాబాద్, 25 సెప్టెంబర్ (హి.స.) ఆర్టీసీ బస్సు, బొలెరో ఢీకొనగా ఒకే కుటుంబానికి చెందిన 15 మందికి తీవ్ర గాయాలైన సంఘటన ములుగు జిల్లాలో శుక్రవారం జరిగింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..... మల్లంపల్లి మండలం సోమ్ల తండా గ్రామానికి చెందిన ఒకే కుటుంబానికి చెందిన 15 మంది బంజారా గిరిజనులు భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి దర్శనం అనంతరం శుక్రవారం ఉదయం భద్రాచలం నుంచి బొలెరో వాహనంలో తిరుగు ప్రయాణమయ్యారు.
హనుమకొండ నుంచి గుంటూరుకు వెళ్లే సూపర్ లగ్జరీ బస్సు కొండపర్తి స్టేజీ సమీపానికి చేరుకోగానే రెండు వాహనాలు ఎదురెదురుగా ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో బొలెరోలో ప్రయాణిస్తున్న 15 మందికి గాయాలు కాగా, వారిని చికిత్స నిమిత్తం ములుగు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉండడంతో వారిని వరంగల్లోని ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు